తిరుపతి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన కలకలంరేపింది. శ్రీకాళహస్తి డిపో బస్సును శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మార్గమధ్యలో డ్రైవర్ వినోద్‌కుమార్ డిపో నుంచి పిచ్చాటూరు వైపు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరారు. తొట్టంబేడు మండలం శివనాథపురం దగ్గర బస్సుకు ముందు నడిరోడ్డుపై మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న మైసూరారెడ్డి, షణ్ముగంలను దాటుకుని వెళ్లడానికి హారన్ కొట్టి క్రాస్ తీసుకుని ముందుకు వెళ్లాడు. బస్సు కొత్తకండ్రిగ దగ్గర వచ్చిన తర్వాత ప్రయాణికులను దింపుతున్న సమయంలో బస్సుకు అడ్డంగా వచ్చి ఆర్‌టీసీ డ్రైవర్‌ను దుర్భాషలాడారు.
డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కొంత మంది అల్లరిమూకలపై తిరగబడటంతో.. బస్సును ఈ మార్గంలో ఎలా నడుపుతావో చూస్తాంరా అంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవీబీపురం మండలం తిమ్మసముద్రం సమీపంలోకి వెళ్లేసరికి అక్కడ 10 మంది వరకు అల్లరిమూకలను వెంటపెట్టుకుని మైసూరారెడ్డి శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన మార్గంపై బస్సుకు అడ్డంగా నిలబడి కర్రలు, రాళ్లతో బస్సును కొడుతూ డ్రైవర్‌పై దాడికి దిగారు. ప్రయాణికులు డ్రైవర్‌ను కొట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే దాడి చేశారు. ఈ ఘటనపై కేవీబీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.