ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే.. రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నదానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారాయన. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తైంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూతనివ్వడం చాలా ముఖ్యం. ఇవి సాధారణమైన సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైంది’’ అని ఆయన అన్నారు.