శ్రీశైలం మల్లికార్జునస్వామివారి దేవస్థానానికి తిరుపతికి చెందిన కెశ్విన్ ఆటో మొబైల్స్ అధినేత ఆర్.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు రూ.14 లక్షలు విలువజేసే ఎంజీ ఆస్టర్ కారును విరాళంగా అందజేశారు. ఆలయం ఎదుట సోమవారం ఈవో డిపెద్దిరాజుకు కారు తాళాలు అందించారు. గంగాధర మండపం వద్ద వేద పండితులు పూజలు చేశారు. దాత ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కర్నూలులో షోరూం ప్రారంభించిన సందర్భంగా స్వామివారికి కారు అందజేసినట్లు వివరించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్, స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు శివప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీశైలంలో 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 26న పౌర్ణమి ఘడియలు రావడంతో ఆరోజే కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారె సమర్పణ, జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. కార్తీక మాసాల్లో పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. వారాంతమైన శని, ఆది, సోమవారాల్లో స్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు నాలుగు విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు ఉంటాయి. దర్శనం టిక్కెట్లను దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు.