తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో వైద్యులు రెండేళ్ల వ్యవధిలో రికార్డు సంఖ్యలో 2,030 గుండె శస్త్ర చికిత్సలు పూర్తి చేశారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా, ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా ఏడు విజయవంతం అయ్యాయని, వీరు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్ రేట్ ఉందని వెల్లడించారు. సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా లభించిందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రోజుల వయసుగల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బృందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ఎక్కువ ఖర్చుతోకూడిన హైరిస్క్ ఆపరేషన్లకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కింద పేదలకు ఉచితంగా గుండెవైద్యం అందిస్తున్నామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా నరం ద్వారా కవాటాలు మార్చడం, ధమనుల శస్త్రచికిత్సలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుందని, ఇక్కడ కిడ్నీ, మెదడు, బోన్‌మ్యారో తదితర చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విభాగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని వివరించారు.
వైద్య బృందంతో పాటు నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో సేవలు అందిస్తుండడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యం. టీటీడీ సహకారంతో అవసరమైన పేద రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో అవయవ మార్పిడిపై అవగాహన పెరగాలని, అవయవ మార్పిడికి ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa