టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రస్తావిస్తూ బాబు ఈ లెటర్ రాసినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీ స్పందించింది.. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని మండిపడింది. ‘ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ.. చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని.. జగన్‌కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ లేఖ వ్యవహారంపై స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారన్నారు. అది ఫేక్.. దాన్ని ఎవరూ నమ్మవద్దు అని అచ్చెన్నాయుడు కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని.. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎవరికి ఓటేయాలనే విషయంలో పార్టీ కార్యకర్తలకు గాని, అభిమానులకు గాని ఎలాంటి సూచనలు చేయలేదన్నారు.
చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీయడానికి వైఎస్సార్‌సీపీ చేసిన కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ వైరల్ చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ బతుకే ఫేక్ బతుకు.. ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందన్నారు. ఆ ఫేక్ లేఖలో చంద్రబాబు సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసు శాఖకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అచ్చెన్నాయుడు.
చంద్రబాబు రాసిన లేఖలో.. ' నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మీరంతా నా వెన్నంటి నిలిచారు. గెలుపు, ఓటముల్లో పాలుపంచుకున్నారు. కష్ట, నష్టాల్లో భాగస్వాములు అయ్యారు. సొంత కుటుంబసభ్యుల్లా నాకు తోడుగా నిలబడ్డారు. మీ అభిమానానికి ప్రతిఫలంగా మీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేశాను. నన్ను నమ్ముకున్న మిమ్మల్ని.. అనతికాలంలో ధనికులను చేశాను. పదవులు, హోదాల్లో మీకు పెద్దపీట వేశాను. మీ బిడ్డలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. మీకు ఇంతటి పేరు, ప్రఖ్యాతలు, పలుకబడి లభించింది అంటే అది నాయొక్క దార్శనికత. కానీ, కొన్నిరోజులుగా మన తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలంటే మీ సహకారం నాకు అవసరం'.
'తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు. జైలులో ఉండగానే ఈ విషయాన్ని అక్కడి నాయకులకు తెలియజేయడం జరిగింది. ఈ హఠాత్తు పరిణామం వల్ల తెలంగాణ కమ్మ సామాజిక వర్గం నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరంతా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఆ పార్టీలో సింహభాగం తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది తెలుగుదేశం నాయకులే. కావున, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నా'.
ఇక, ఆంధ్రప్రదేశంలో నిమ్నవర్గాలన్నీ అధికార పక్షానికి మద్దతు పలుకుతున్నాయి. మనకు పెత్తందార్లు అనే ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో మన కమ్మ సామాజిక వర్గమంతా ఆందోళనలకు సిద్ధం కావాలి. మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలి. ఒక సీనియర్ రాజకీయవేత్తగా నాకు జరిగిన అవమానం జీర్ణించుకోలేనిది. ప్రభుత్వం నమోదు చేయిస్తున్న కేసుల నుంచి బయటపడాలంటే మరింత సమయం కావాలి. కానీ, ఈలోపే ఎన్నికలు సమీపించేలా ఉన్నాయి. నేను మళ్లీ జైలుకు వెళ్లినా మీ పోరాటం మాత్రం ఆపవద్దు. మన సామాజికవర్గం ఏకమైతే ఈ ప్రపంచాన్ని కూడా ఏలవచ్చు. అంతటి సామర్థ్యం మనకు ఉన్నది. కావున బేధాభిప్రాయాలు పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేయండి. మన పార్టీ గెలిస్తేనే. మన జాతికి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వేడుకుంటున్నా'అంటూ లేఖను వైరల్ చేస్తున్నారు. కానీ ఈ లెటర్ ఫేక్ అని టీడీపీ క్లారిటీ ఇచ్చింది.