లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో కులగణన నిర్వహించి సంచలనం సృష్టించిన నితీశ్ కుమార్.. తాజాగా రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలకు బిహార్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్లకు బిహార్ శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కులాల వారీగా రిజర్వేషన్ల పెంపుదల కోసం తయారు చేసిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో బిహార్‌లో రిజర్వేషన్ కోటా 65 శాతానికి పెరగనుంది. ఇక ఆ బిల్లుకు గవర్నర్ సంతకం చేస్తే చట్టంగా మారనుంది.
బిహార్‌లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కోటాను పెంచే ప్రతిపాదనలో భాగంగా నితీశ్ కుమార్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లు 65 శాతానికి పెరగనున్నాయి. అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. ప్రస్తుతం బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 1 శాతం, వెనుకబడిన తరగతుల మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.
అయితే తాజాగా ఆమోదం పొందిన బిల్లు చట్టంగా మారితే ఈ రిజర్వేషన్లు కాస్త మారనున్నాయి. పెరిగిన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 2 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇక ఓబీసీలకు, ఈబీసీలకు కలిపి 43 శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. బిహార్ రాష్ట్ర మొత్తం జనాభా 13 కోట్లు. ఈ మొత్తం జనాభాలో ఓబీసీలు 63 శాతంగా ఉండగా.. ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 1.68 శాతంగా ఉన్నారు. ఇక అగ్ర కులాలకు చెందిన వారు 15.52 శాతంగా ఉన్నారు. ఓబీసీల్లో వెనుకబడిన తరగతుల ప్రజలు 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన వారు 36 శాతం ఉన్నారు. ఇక భూమిహార్లు 2.86 శాతం, బ్రాహ్మణులు 3.66 శాతం, సీఎం నితీష్ కుమార్ సామాజిక వర్గమైన కుర్మీలు 2.87 శాతం.. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వర్గమైన యాదవులు 14 శాతం, ముసహర్‌లు 3 శాతం ఉన్నారు.
అయితే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. బిహార్‌లో కులాల వారీగా లెక్కల్ని తీసేందుకు నితీశ్ కుమార్ సర్కార్ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే ఫలితాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా.. తాజాగా దాని ఆధారంగా రిజర్వేషన్లను పెంపుదల చేస్తూ బిల్లును తయారు చేసి దాన్ని సభలో ఏకగ్రీవ ఆమోదాన్ని కల్పించింది.