సాధారణంగా మనం ఏదైనా అస్వస్థతకు గురైతే ఇంజెక్షన్ వేసుకుంటాం. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే ఓ రూ.50, రూ.100 ఉంటుంది. కానీ ఆ ఇంజెక్షన్ ఖరీదు వింటే అనారోగ్యమే పారిపోయేలా ఉంది. ఎందుకంటే ఒకే ఒక్క డోసు ఖరీదు రూ.17 కోట్లు. ఈ ఇంజెక్షన్ ధర ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఇంజెక్షన్‌ల కంటే అధిక ధర కలిగింది. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినా తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ విన్నపం చేశారు.
ఈ ప్రపంచంలోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. రెండేళ్లలోపు పిల్లలకు ఉపయోగించే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యు చికిత్స మరోసారి వార్తల్లో ఎక్కింది. అయితే ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్‌కు భారత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. అయితే ఈ వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారి డాక్టర్లు ఇచ్చిన సూచనలు.. వాటికి ప్రభుత్వం ఇచ్చే ఆమోదం ద్వారా మాత్రమే ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అయితే దీని ధర ఒక్క డోసుకే రూ.17 కోట్లు కావడంతో అంత భారీ ఖర్చు పెట్టలేక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ మెడిసిన్ వల్ల ప్రయోజనం ఉంటుందని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌లలో ఒకటైన ఈ జోల్జెన్స్మా.. రూ. 17 కోట్లు కావడం.. కొన్ని కేసుల్లో వీటిని విదేశాల నుంచి తెప్పించడం.. ఆ ఇంజెక్షన్ కొనేందుకు బాధితులు.. విరాళాలు సేకరించడంతో పలు మార్లు ఇప్పటికే వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవల కర్ణాటకలో ఇలాంటిదే ఒక వెన్నెముక కండరాల క్షీణత కేసు నమోదైంది. 15 నెలల చిన్నారికి ఈ అత్యంత అరుదైన వ్యాధి సోకడంతో ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తావించారు. ఆ15 నెలల చిన్నారి ట్రీట్మెంట్‌కు సహాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థించారు.
ఈ అత్యంత ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ను స్విస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన నోవార్టిస్ తయారు చేస్తుంది. దీన్ని స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జన్యు సంబంధమైన వ్యాధికి చికిత్స అందించేందుకు రూపొందించారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వెబ్‌సైట్ ప్రకారం.. వెన్నెముక కండరాల క్షీణత అనే వ్యాధి సోకిన వారికి.. నరాలు, కండరాలపై ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి సోకిన వారి కండరాలు బలహీనంగా మారతాయి. అయితే ఈ వ్యాధి అనేది ఎక్కువగా అప్పుడే పుట్టిన శిశువులు, చిన్న పిల్లలకు సోకుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ పెద్ద వయసు వారిలో కూడా కనిపిస్తోంది. అయితే ఈ దారుణమైన వ్యాధితో ఒక్క అమెరికాలోనే సుమారు 10 వేల నుంచి 25 వేల మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారని కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు తెలిపాయి.