చైనా ఆలోచనలు, అడుగులు ఎప్పుడూ స్వీయ ప్రయోజనాల కోణంలోనే ఉంటాయి. ఈ క్రమంలో ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా డ్రాగన్ ఖాతరు చేయదు. మొదటి నుంచి దాని ధోరణే అంత. భవిష్యత్తులో తన ఆధిపత్యానికి గండికొట్టే ప్రమాదం ఉందన్న భయంతో.. భారత్‌కు అడుగడుగునా అడ్డు తగులుతున్న చైనా.. తనకు అవసరమనుకున్న పాకిస్థాన్‌తో ఎంత స్నేహంగా మెలుగుతుందో తెలిసిందే. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ నిర్మిస్తోన్న డ్రాగన్.. పాకిస్థాన్‌కు పెద్ద ఎత్తున నిపుణులు, శ్రామికులను పంపిస్తోంది. 2013లో 20 వేల మంది చైనీయులు పాక్‌లో ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య 60 వేలకు చేరుకుంది. 5 లక్షల మంది చైనీయులు ఉండేందుకు వీలుగా పాకిస్థాన్‌లో ఓ పెద్ద కాలనీని నిర్మిస్తున్నట్లు నాలుగేళ్ల క్రితమే వార్తలొచ్చాయి. అంటే మన పొరుగు ఉన్న పాకిస్థాన్‌లో చైనీయుల సంఖ్య మరింత పెరగనుందన్నమాట. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర జలాల్లో ప్రాబల్యం పెంచుకుంటూ.. అడుగడుగునా మనకు ఆటంకం కలిగిస్తోన్న చైనాకు షాకిచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది. ఫ్యాక్టరీలు, పొలాలు, హాస్పిటల్స్‌లో పని చేయడం కోసం లక్ష మంది భారతీయులను మన దేశం తైవాన్‌కు పంపించనుంది. ఇందుకోసం భారత్, తైవాన్ మధ్య డిసెంబర్ నాటికి ఒక ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందం భారత్, తైవాన్.. రెండు దేశాలకు లబ్ధి కలిగించనుంది.