ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్య చేసుకుంటానని లోకోపైలట్ బెదిరింపులు.. మెంటల్ ఆస్పత్రిలో పడేసిన అధికారులు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 10:15 PM

ఉన్నతాధికారుల నుంచి తనకు ఎదురువుతోన్న ఇబ్బందులను తెలియజేయడానికి ప్రయత్నించిన ఓ లోకోపైలట్‌కు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. మనోవేదనకు గురైన అతడు సమస్యను ఎత్తిచూపాలని భావించిన ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. అయితే, ముందుగానే అప్రమత్తమైన అధికారులు అతడ్ని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. చివరకు తన మానసిక ఆరోగ్యం సక్రమంగానే ఉందని నిరూపించుకోవడానికి 9 రోజుల పాటు నానా తంటాలు పడ్డాడు. ఆస్పత్రి వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో మళ్లీ విధుల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు.


కానీ, లోకోపైలట్ మాత్రం తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు. ఉన్నతాధికారులు అత్యుత్సాహం వల్లే తాను వేదనకు గురయ్యానని వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే డివిజన్‌‌లో బాధితుడు శ్యామ్ సింగ్ (48) అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా 1996లో భారతీయ రైల్వేలో చేరాడు. అనంతరం సీనియర్‌ లోకో పైలట్‌గా ప్రమోషన్ దక్కింది. శ్యామ్ తన పనితీరుకు రైల్వే అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కానీ, గతేడాది అక్టోబర్‌లో ఆయనకు ఉన్నతాధికారులు.. డ్రైవింగ్ సమయంలో ఉల్లంఘనకు పాల్పడ్డారని ఓ నోటీసు పంపడం వివాదానికి కారణమయ్యింది.


దీనిని ఖండించిన శ్యామ్ సింగ్.. వ్యక్తిగత కక్షతోనే సీనియర్లు తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించాడు. తీవ్రంగా కలత చెందిన అతడు, తనకు అన్యాయం జరుగుతోందని వాపోయాడు. సీనియర్లు తన వాదనను వినడం లేదని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్‌ 23న పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం సన్నిహితులు సూచనల మేరకు దాన్ని ఉపసంహరించుకుంటున్న ఉన్నతాధికారులను అభ్యర్థించాడు. కానీ, అప్పటికే రాజీనామాను ఆమోదించిన అధికారులు.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న రిలీవ్‌ చేశారు.


దాంతో శ్యామ్‌ సింగ్‌ న్యాయపోరాటం మొదలుపెట్టాడు. రిలీవ్‌ను సెంట్రల్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌లో సవాలు చేయగా.. అక్కడ ఊరట దక్కింది. ట్రైబ్యునల్ స్టే విధించడంతో సర్వీసును పునరుద్ధరించారు. అయినప్పటికీ.. తనను మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిపేందుకు అనుమతించాలని కోరాడు. ఉన్నతాధికారులు అందుకు ససేమిరా అన్నారు. పలుసార్లు తిరస్కరించడంతో విసిగిపోయిన సింగ్‌.. తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు సిబ్బంది ఫిర్యాదు బుక్‌లో పేర్కొన్నాడు.


దాంతో అతడికి మానసిక ఆరోగ్యం సక్రమంగా లేదని భావించిన అధికారులు.. రైళ్లు నడిపే సామర్థ్యం ఉందా? అని తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్ష అవసరమని నిర్ధారించారు. చివరకు అతడ్ని మానసిక వైద్యశాలకు తరలించారు. తాను సరిగ్గా ఉన్నానని, ఎటువంటి మానసిక సమస్యలు లేవని ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఆయన 9 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వహించిన ఎన్‌సీసీటీ పరీక్షల్లో ఫలితాలు సాధారణంగా వచ్చాయి. వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా.. తాజాగా లోకో పైలట్లకు ప్రతి మూడేళ్లకు ఓసారి నిర్వహించే రీఫ్రెషర్‌ కోర్సు చేయాలని రైల్వే అధికారులు సూచించడం గమనార్హం. ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్ఓ ప్రశాంతి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఒకవేళ రైళ్లు నడపడానికి అతడు మానసికంగా దృఢంగా ఉన్నాడా? అనేది తెలుసుకోడానికి వైద్య పరీక్షలు తప్పనిసరి అని అన్నారు. ‘రైళ్లు నడిపే విషయంలో ప్రతి రక్షణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. వేలాది మంది ప్రయాణికులను తీసుకెళ్లే లోకోపైలట్‌కు మానసిక దృఢత్వం తప్పనిసరి’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com