తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇవాళ భక్తుల రద్దీ చాలా స్వల్పంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుంగా భక్తులను నేరుగా క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. గతవారంలో కూడా భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు.. ఒకటి, రెండు రోజులు భక్తుల్ని నేరుగా క్యూ లైన్‌లోకి అనుమతించారు. ఆదివారం శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకున్నారు.. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్ టీటీడీ తెలిపింది. శ్రీవారికి 21,974 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం కల్పవృక్ష, సాయంత్రం హనుమంత వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీలు అమ్మవారికి చీర, పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు. పద్మశాలీలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.