దీపావళి పండుగేమో కానీ.. వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సంతోషంగా పేల్చుతున్న బాణాసంచానే.. చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పుడు ఆ బాణాసంచా కారణంగా ఓ ఫర్నీచర్ గోదాం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం అయ్యప్ప నగర్‌లో జరిగింది. ఎక్కడో పేల్చిన ఓ రాకెట్.. దూసుకొచ్చి సరాసరి ఫర్నీచర్ షాపులోకి దూరింది. దీంతో.. ఆ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గోదాంలో పరుపులు, ఫోమ్‌కు సంబంధించిన వస్తువులు ఉండటంతో.. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. నిమిషాల్లోనే.. గోదామంతా మంటలు వ్యాపించాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ గోదాం యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన యజమాని కళ్ల ముందే తన గోదాం కాలిపోతుంటే గుండెలు బాదుకుంటూ రోధించాడు. అయితే.. సమయానికి పట్టణంలో ఫైరింజన్ లేకపోవటంతో.. పుట్టపర్తి నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ఫైరింజన్ వచ్చే సమయంలో స్థానికులే మంటలు ఆర్పేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండటంతో.. పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక.. ఫైరింజన్ ఘటనా స్థలికి వచ్చే సమయానికి గోదాం మొత్తం బూడిదైపోయింది. ఆలస్యంగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైరింజన్.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. అప్పటికే ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటల్లో గోదాంలో ఉన్న ఫర్నీచర్, పరుపులు అన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలో కూడా.. 24 గంటల వ్యవధిలోనే నాలుగైదు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించగా.. హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.