అమెరికాకు చెందిన ఆర్మీ హెలికాప్టర్ మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్‌కు చెందిన సైనికులు సముద్రంలో జలసమాధి అయ్యారు. సముద్రంలో సైనిక హెలికాప్టర్ కూలిన విషయాన్ని అమెరికన్ మిలిటరీ ఆదివారం ధ్రువీకరించింది. అయితే ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మరింత విస్తరించి ప్రాంతీయ వివాదంగా మారకుండా ఉండేందుకు అమెరికా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మధ్యధరా సముద్రంలో యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మోహరించింది. ఈ గ్రూప్‌లోని ఒక హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన తర్వాత ఈ ప్రమాదానికి గురైంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం మధ్యధరా సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయిందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.
యునైటెడ్ స్టేట్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌కు చెందిన ఒక ఆర్మీ హెలికాప్టర్.. సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10 వ తేదీన గాల్లోకి ఎగిరింది. ఈ క్రమంలోనే ఐదుగురు అమెరికన్ సర్వీస్‌కు చెందిన సైనికులతో వెళ్తున్న ఆ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు అక్కడికక్కడే చనిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఐదుగురు సైనికులతో కూడిన హెలికాప్టర్ సముద్రంలో మునిగిపోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనికుల మృతి పట్ల సంతాపం తెలిపారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం సైనికులు ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా బైడెన్ వెల్లడించారు. సైనికులు తమ దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని కొనియాడారు.
మధ్య ప్రాచ్యం(మిడిల్ ఈస్ట్) దేశాల్లో పెరుగుతున్న ఘర్షణలు, యుద్ధాలను అడ్డుకునేందుకు.. అవి విస్తరించకుండా ఉండేందుకు ఆయా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటోంది. అయితే అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు మిలిటెంట్ గ్రూపులు ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులను ఉద్ధృతం చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా సైనికులపై విదేశాల్లో దాడులు ఆగాలంటే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపేలా అమెరికా చొరవ తీసుకోవాలని హెజ్‌బొల్లా గ్రూప్ డిమాండ్ చేసింది.