చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్‌ను నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ విడిభాగం(క్రయోజనిక్ అప్పర్ స్టేజ్) ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంపై దీని ప్రభావ పాయింట్ ఉన్నట్టు అంచనా వేసిన ఇస్రో.. దీని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్లలేడని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో ఇది భూ వాతావరణంలోకి వచ్చినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది.
ఈ ఏడాది విజయవంతంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊహించిన దాని కంటే అద్భుతంగా పనిచేసింది. చంద్రుడిపై రహస్యాలు తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టడం, ఆ తర్వాత రోవర్ అక్కడ 14 రోజుల పాటు కలియ దిరగడం, అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలు, మట్టి, అందులో మూలకాలపై కీలక వివరాలు ఇవ్వడం పూర్తయ్యాయి. ఆ తర్వాత మంచులో కూరుకుపోయిన చంద్రయాన్ 3 కథ ముగిసిందని అంతా భావించారు. ఇస్రో కూడా ఇదే తేల్చేసింది.
కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది. ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 వ్యోమనౌకను దాని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ఉంచిన ఎల్‌విఎం3 ఎమ్4 వాహక నౌక యొక్క క్రయోజెనిక్ ఇంజన్ విడి భాగం ఒకటి ఇస్రో నియంత్రణ కోల్పోయింది. ఇస్రో లింక్ తెగిపోయిన సదరు వాహక నౌక భాగం తిరిగి వెనక్కి రావడం మొదలుపెట్టింది. ఇలా నియంత్రణ లేకుండా కిందకు పడిపోతున్న ఆ భాగం తాజాగా భూమి వాతావరణం లోకి కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఇస్రో ఇవాళ వెల్లడించింది. లాంచింగ్ చేసిన 124 రోజుల తర్వాత రాకెట్ విడిభాగం భూ వాతావరణంలోకి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది.