ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంది.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె.. నెల్లూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.. అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బీజేపీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
ఇక, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు పురంధేశ్వరి.. నెల్లూరులో రైల్వే స్టేషన్ ను 102 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోందని తెలిపారు. రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నారు.. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. నీటిపారుదల.. రహదారుల నిర్మాణంతో పాటు నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు బీజేపీ ఆంధ్రపదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. కేంద్రం నిధులతో చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను పురంధేశ్వరి పరిశీలిస్తూ వస్తోన్న విషయం విదితమే.