విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ గుడ్‌న్యూస్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో రద్దీగా ఉండే విజయవాడ-విశాఖ మధ్య ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా.. మరో రెండు లైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ను పూర్తి చేస్తామన్నారు. రైల్వే డివిజన్ పరిధిలో ప్రస్తుతం విజయవాడ, గుణదల సహా పలు స్టేషన్ల అభివృద్ధి వేగవంతంగా సాగుతోందన్నారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. ట్రాక్ మార్చేందుకు ముస్తాబాద్ వద్ద రైల్ ఓవర్ రైల్(ఆర్‌వోఆర్) నిర్మాణం కూడా సాగుతోందన్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో భద్రత కోసం రెండు బ్యాగేజీ స్కానర్లు మంజూరయ్యాయని తెలిపారు. వాటిని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా పేలుడు పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు నరేంద్ర పాటిల్ తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని ప్రధాన స్టేషన్లలో ఆర్‌పీఎఫ్ బృందాలు, టికెట్ చెకింగ్ స్క్వాడ్‌లు కలిసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక డాగ్‌స్క్వాడ్‌ను కూడా నియమించి సెర్చ్ ఆపరేషన్లను నిర్వహించినట్లు తెలిపారు.
అలాగే పార్శిల్ కార్యాలయాల వద్ద అన్ని వాహనాలు, సరకును తనిఖీ చేశామన్నారు డీఆర్ఎం. దీపావళి సందర్భంగా 26 ప్యాంటీ కార్, 193 ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లలో తనిఖీలు నిర్వహించామన్నారు. రైళ్లలో మండే పదార్థాలైన గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, స్టవ్‌లు, అగ్గిపెట్టెలు, సిగరెట్ లైటర్లు, బాణసంచా వంటివి తీసుకెళ్లేందుకు ప్రయత్నించొద్దని ప్రయాణికులను కోరారు. పేలుడు, మండే పదార్థాలను తరలించేవాళ్లపై రైల్వే చట్టం 1989 కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.