శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో భారీ తిమింగలం ఒడ్డుకు చేరింది. సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు తీరంలో.. శుక్రవారం ఉదయం సముద్ర వేటకు వెళ్తున్న మత్స్యకారులు భారీ తిమింగలం మృతదేహాన్ని గమనించారు. భారీ తిమింగలం చనిపోయి ఉండటంతో దాని గురించి అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ తిమింగలం దాదాపు 15 మీటర్లు పొడవు.. పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తిమింగలం సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరిందని.. దుర్వాసన రావడంతో తాము గమనించి అధికారులకు తెలియజేసినట్లు మత్స్యకారులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న టెక్కలి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ జగదీష్, మత్స్య శాఖ అధికారులు తిమింగళం కళేబరాన్ని పూడ్చివేశారు. ఈ భారీ తిమింగలం మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ తిమింగలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇక్కడ ఎందుకు చనిపోయింది అనే దానిపై అధికారులు సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఇటీవల భావనంపాడు సమీపంలో తిమింగలాలు ఏవైనా సంచరించాయా అని ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో మత్స్యాకారులను ఆరా తీస్తున్నారు అధికారులు.