హైదరాబాద్‌లో తన శేష జీవితాన్ని గడుపుతానంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి. హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో విశాఖ శారదా పీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శుక్రవారం ఆయన జన్మదినోత్సవాన్ని విశాఖ శారదా పీఠంలో ఘనంగా నిర్వహించగా.. విశాఖలో ఇదే తన చివరి జన్మదినోత్సవమని చెప్పారు. వచ్చే ఏడాది షష్టిపూర్తి కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంలో చేసుకుంటానన్నారు. అక్కడే ఉంటూ ఆదిశంకరుల అద్వైత తత్వంపై పరిశోధనలు చేపడతానన్నారు స్వామి.
తాను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిందని.. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామన్నారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోందని.. తాను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటాను అన్నారు. ఇక పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది.. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తాను అన్నారు. విద్యాధికుడైన ఆయన ధర్మ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటారన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది.