తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ఆన్‌లైన్ టికెట్లను నవంబరు 16న మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ హోమంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరడమైనది. అలిపిరి వద్ద గల సప్తగోప్రదక్షిణశాలలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ఏర్పాట్లను బుధవారం జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. హోమం నిర్వహణకు, భక్తులు కూర్చునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 20 నుండి పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జేఈవో సదా భార్గవి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ సమావేశం జరిగింది. గతేడాది తరహాలోనే నవంబర్ 20న తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ గ్రౌండ్స్‌లో కార్తీక దీపోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 27న కర్నూలులోని ఎపిఎస్‌పి గ్రౌండ్స్‌లో, డిసెంబర్ 11న విశాఖలోని ఆర్‌కె బీచ్‌లో గల శ్రీ కాళీమాత ఆలయానికి ఎదురుగా దీపోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. రెండేళ్లుగా దాతల సహకారంతో దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఈ ఏడాది తిరుపతిలో 2 వేల మంది, మిగిలిన రెండు చోట్ల 3 వేల మందిని అంచనా వేస్తున్నామని చెప్పారు.
తిరుపతిలో నిర్వహించే దీపోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. సాయంత్రం 5.30 గంటలకు వేద స్వస్తితో దీపోత్సవం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం దీప ప్రశస్తి, టీటీడీ ఛైర్మన్ సందేశం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణుసహస్రనామ పారాయణం, మహాలక్ష్మీ పూజ, దీప లక్ష్మి నృత్యరూపకం, గోవిందనామాలు, చివరగా కుంభ హారతితో రాత్రి 8.30 గంటలకు ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం నోడల్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు, వ్యాఖ్యాతలను నియమించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారిని ఆదేశించారు.
తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ మహిళా ఉద్యోగులతో కలిసి జేఈవో సదా భార్గవి శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. ప్రతి ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ మహిళా ఉద్యోగులు సారె అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు జేఈవో సదా భార్గవి. అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు, ఆలయ సూపరిండెంట్ వాణి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.