ప్రకాశం జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసనకు దిగాడు. పొలం విషయంలో అన్యాయం జరిగిందని.. నోటికాడి కూడు తీసిన అప్పటి ఎమ్మార్వో అంటూ రమేష్ అనే రైతు ఎడ్ల బండిపై ఫ్లెక్సీలు కట్టి అధికారుల పేర్లు ప్రచురించి ఆందోళన చేశాడు. బేస్తవారిపేట మండలం నేకునాంబాద్‌కు చెందిన రైతు రమేష్.. కొంతమంది కబ్జాదారులు అధికారుల అండతో తన పొలంలో వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల పేర్లు ఫ్లెక్సీలపై ప్రచురించి ఎడ్ల బండికి కట్టి నిరసన తెలిపాడు. బెస్తవారిపేట మండలం నేకునాంబాద్లో తనకు 86 సెంట్ల భూమి ఉందని.. ఆ భూమిలో కబ్జాదారులు నాలుగు అడుగుల మేర గుంతలు తవ్వి ఆ మట్టిని అమ్ముకున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నాడు. రైతు ముందుగా కంభం పట్టణంలో నిరసన ర్యాలీ చేసి తర్వాత అక్కడే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతి పత్రాన్ని సమర్పించారు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు విన్నవించాడు. మరి అధికారులు రైతు ఫిర్యాదుపై ఎలా చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.