దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. గవర్నర్‌లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అస్సలు పొసగడం లేదు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం.. తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. దీంతో శాసనసభలు ఆమోదం తెలిపిన బిల్లులు కూడా చట్టాలుగా మారడం లేదు. దీంతో ప్రభుత్వానికి, గవర్నర్లకు మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో సభ ఆమోదం తెలిపి పంపించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా.. కారణం చెప్పకుండా వెనక్కి పంపించడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తిప్పిపంపిన బిల్లులను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరీ.. మళ్లీ ఆమోదం కల్పించింది.
అసెంబ్లీ తీర్మానం పూర్తయిన బిల్లులకు గవర్నర్ ఆమోదం కల్పించకుండా ఆలస్యం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎలాంటి కారణాలు చెప్పకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపించిన బిల్లులకు తాజాగా అసెంబ్లీ మరోసారి ఆమోదం తెలిపింది. దీని కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన స్టాలిన్ సర్కార్.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను ఏకగ్రీవంగా మరోసారి ఆమోదించింది.
ఈ 10 బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండు చొప్పున బిల్లులు ఉన్నాయి. ఇక 2022 లోనే తమిళనాడు శాసనసభ ఆమోదించిన మరో 6 బిల్లులు కూడా ఉన్నాయి. ఇందులో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తొలగించేలా తీసుకొచ్చిన తీర్మానం కూడా ఉండటం గమనార్హం. యూనివర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఆ బిల్లు తీసుకొచ్చింది.
బిల్లులపై చర్చ సందర్భంగా సీఎం స్టాలిన్ గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కారణాలు లేకుండా బిల్లులను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ వెనక్కి పంపారని.. ఇది అప్రజాస్వామికమని.. ప్రజా వ్యతిరేకమని స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను పెండింగ్‌లో ఉంచడంపై తమిళనాడు సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. గవర్నర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 12 బిల్లులను పెండింగ్‌లో పెట్టడానికి సంబంధించి స్టాలిన్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. బిల్లులను మళ్లీ ఆమోదించడం గమనార్హం. నిత్యం ప్రభుత్వంపై గవర్నర్.. గవర్నర్‌పై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం.