బెజవాడలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్‌లో వేగంగా వచ్చిన రెండు కార్లు.. పలు బైక్‌లను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు కారు రేస్ పెట్టుకుని వేగంగా నడిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువతులు, యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరు ఈ గ్రూపులలో ఉన్నది.. రేసింగ్‌పై ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుంచి కారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. ఎవరు ఎవరు ఈ గ్రూపులలో ఉన్నారనేది విచారిస్తున్నారు. నగరంలోని ఏఏ ప్రాంతాలలో రేసింగ్ లు నిర్వహిస్తున్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై బడాబాబులు ఒత్తిడి చేస్తున్నారు.
రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఫార్చ్యూనర్ కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌లపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి అమాంతం కిందపడ్డారు. స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయాయి. ఘటనా స్థలిలోకారును వదిలేసి అమ్మాయి, అబ్బాయిలు మరో కారులో పారిపోయారు. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లలో రేసింగ్ చేసినట్లు గుర్తించారు. రమేష్ ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ కారు రేసింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.