సిక్కులకు ఎంతో పవిత్ర స్థలం పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ప్రాంగణంలో మతవిశ్వాసాలను దెబ్బతీసేలా పార్టీని ఏర్పాటు చేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ పార్టీలో మద్యం, మాంసం వడ్డించారని, ఇది సిక్కుల విశ్వాసాలకు విరుద్ధమని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి జగదీప్ సింగ్ కహ్లోన్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పాకిస్థాన్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, రెండేళ్ల కిందట కర్తాపూర్ సాహిబ్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. గురుద్వారా ప్రాంగణంలో పాకిస్థాన్ మోడల్ ఫోటో షూట్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ట్విట్టర్‌లో స్పందించిన కహ్లోన్ ‘ఇది ఆమోదయోగ్యం కాదు.. గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్ పవిత్ర ప్రాంగణంలో మద్యం, మాంసాహారంతో కూడిన పార్టీని ఏర్పాటు చేసిన అపవిత్ర సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను... పాకిస్థాన్ ప్రభుత్వం బాధ్యులందరిపై వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఈ ఘటనపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రెసిడెంట్ హర్జీందర్ సింగ్ ధామీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రెసిడెంట్ హర్మీత్ సింగ్ కల్కా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గురునానక్ దేవ్‌కు సంబంధించిన గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగితే అది మర్యాద, సిక్కుల మనోభావాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎస్జీపీసీ ప్రెసిడెంట్ ధామి ఉద్ఘాటించారు. ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘ప్రపంచ సిక్కు సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడటం మానుకోవాలి’ అని అన్నారు.
కర్తార్‌పూర్ కాంప్లెక్స్‌లో అంతర్భాగమైన పీఎంయూ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనపై నిర్వాహకుల బహిరంగ క్షమాపణ చెప్పాలని ఢిల్లీ గురుద్వారా కమిటీ ప్రతినిధి మంజిత్ సింగ్ భోమా డిమాండ్ చేశారు. మతపరమైన ప్రదేశం పవిత్రతను అగౌరవపరిచే ఏవైనా చర్యలను సిక్కు సంస్థలు చాలా తీవ్రంగా పరిగణిస్తాయని అన్నారు. సిక్కు మత ప్రబోధకుడు గురునానక్ తన జీవితం చివరి దశలో గడిపిన కర్తార్‌పూర్ సాహిబ్‌ను ప్రపంచవ్యాప్తంగా సిక్కులు ఎంతో పవిత్రమైనదిగా భావించారు. ఏదైనా కించపరిచే చర్యలకు పాల్పడితే సిక్కు సమాజం ప్రతిచర్యలు బలంగా ఉంటాయి. డ్యాన్స్ పార్టీ నిర్వహించి కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వార నిర్వాహకులు సిక్కుల మనోభావాలను అగౌరవపరిచారని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. పార్టీకి హాజరైన వారిలో పలువురు మద్యం సేవించి మాంసం తిన్నారని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.