వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..... గత ప్రభుత్వాల పాలనలతో విసిగిపోయి నిరాశ, నిస్పృహలతో నిట్టూరుస్తున్న వర్గాలకు జగన్ తన జనరంజక పాలనతో వెలుగులు నింపారన్నారు. గతంలో అధికారమిచ్చినపుడు ఏమీ చేయని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారం కావాలంటున్నాడని, కేవలం మరోసారి దోపిడీ కోసమే చంద్రబాబు అధికారంకోసం తపిస్తున్నాడని తెలిపారు. ప్రజలకు మేలు చేసే పనులను జగన్ చేసాడని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ నీడ లేని కుటుంబాలకు ఇళ్లు, వృద్ధులకు పెన్షన్, మహిళలకు, రైతులకు రుణాల మాఫీ చేయడం తప్పా అని చంద్రబాబుని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గుడని చంద్రబాబు చెప్తున్నాడని, సమాజంలోని అంతరాలను తొలగించడానికి సామాజిక సాధికారత చేయడం దుర్మార్గమా, పేదలకు అసైన్డ్ భూమి పై అధికారాలు కట్టబెడుతూ చట్టబద్ధం చేయడం దుర్మార్గమా అని చంద్రబాబును ధర్మాన ప్రసాదరావు నిలదీసారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, గతంలో డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తన వర్గానికి చెందిన కొంతమంది ధనవంతులకు సంపద దోచిపెట్టడానికే చంద్రబాబు అధికారం వినియోగిస్తాడని మండిపడ్డారు. విశాఖను రాజధాని చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతం వృద్ధి చెంది మన భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. ప్రతీ కార్యక్రమం జగన్ పాలనలో పారదర్శకంగా జరుగుతోందని, అవినీతి లేని సమాజాన్ని స్థాపిస్తున్నారని వివరించారు. ధనిక, పేద మధ్య ఉన్న అంతరాలను తొలగించేది విద్య మాత్రమేనని సీఎం జగన్ గుర్తించారని, అందుకే నాడు - నేడు ద్వారా నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించారన్నారు. చంద్రబాబు పదే పదే అబివృద్ధి చేశానని చెబుతుంటాడని, ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కటంటే ఒక్కటి చెప్పాలని ధర్మాన ప్రసాదరావు సవాల్ చేసారు.