ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న కారణంతో పెద్ద గొడవ,,,క్లాస్‌రూమ్‌లోనే చితక్కొట్టుకున్న విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 10:21 PM

ఒంగోలు మెడికల్ కాలేజీలో కొంత మంది విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు చితకబాదుకున్నారు. ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు, ముఖంపై బలమైన గాయాలైన పలువురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు.


విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే, క్లాస్ రూమ్‌లో ఉన్న కొంత మంది అమ్మాయిలు తమ సెల్ ఫోన్లో వీడియోను చిత్రీకరించారు. తరగతి గదిలో జరిగిన ఘర్షణపై ఒక వర్గానికి చెందిన విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, బయటకి వచ్చిన తర్వాత ఓ మెడికల్ కాలేజీ వద్ద సదరు విద్యార్థులను మరో వర్గం విద్యార్థులు అడ్డగించి నిలదీశారు. ‘ఇప్పుడు చూసుకుందాం.. రండ్రా’ అంటూ వారిపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.


విద్యార్థుల మధ్య ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మెస్ విషయంలో ఏడాది కిందట జరిగిన గొడవలో ఓ విద్యార్థికి గుండు కొట్టించినట్లు సమాచారం. కొంత మంది విద్యార్థుల ఫిర్యాదుతో ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వాళ్లు తిరిగి కాలేజీకి వచ్చిన తర్వాత ఘర్షణలు మరింత పెరిగాయి. విద్యార్థులు కులాల పేరుతోనూ కొట్టుకున్నట్లు తెలుస్తోంది.


మెస్‌కు కొంత మంది విద్యార్థులు మద్యం తాగొచ్చి గొడవ చేస్తున్నారని.. హాస్టల్‌లో కొంత మంది విద్యార్థులు గంజాయి సేవించారని ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు ఈ విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ అలాంటి ఆనవాళ్లేమీ దొరకలేదని తెలిపారు. సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని డీఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు.


తల్లిదండ్రులు కష్టపడి ఎంబీబీఎస్ చదివిస్తుంటే, విద్యార్థులు బాధ్యతగా ఉండాల్సింది పోయి, చిన్న చిన్న కారణాలకే కొట్టుకున్నారని.. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకాశం జిల్లా పోలీసులు అన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి ఇరువర్గాలకు చెందిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. మెస్‌కు సంబంధించిన వివాదంపైనా చర్చించి వెంటనే చర్యలు తీసుకోమని కాలేజీ ప్రిన్సిపల్, సిబ్బందికి సూచించినట్లు ఆయన చెప్పారు.


‘కొంత మంది విద్యార్థులు మద్యం తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో.. ఈ ఏడాది ఆగస్టులో కళాశాల ప్రిన్సిపల్, కమిటీ వారు విచారణ జరిపి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని హాస్టల్ నుంచి బయటకు పంపించేశారు. హాస్టల్ బయట నుంచే వారు తరగతులకు హాజరవుతున్నారు. వాళ్లు ఆ విధంగా హాస్టల్లో లేకుండా చేయడానికి కారణమైన కొంత మంది విద్యార్థులపై సస్పెండ్ అయిన విద్యార్థులు కక్ష పెంచుకున్నారు’ అని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.


సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈఎన్టీ క్లాసులో ఇద్దరు విద్యార్థులు సెమినార్ ఇస్తుండగా.. దానిపై కామెంట్స్, ప్రతి కామెంట్స్ చేసుకున్నారని.. లెక్చరర్ వెళ్లిపోయిన తర్వాత విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. ‘ఆ తర్వాత ఇరు వర్గాల వారు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. అనంతరం సాయంత్రం కాలేజీ బయట మెడికల్ షాప్ వద్ద తారసపడి కొట్టుకున్నారు. సంఘమిత్ర హాస్పిటల్ వద్ద ఉన్న టీ షాప్ వద్ద రాత్రి 8:30కు మరోసారి ఘర్షణపడ్డారు. ఈ గొడవలలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇది కులాల మధ్య గొడవ కాదు. గంజాయి కొరకు జరిగిన గొడవ కాదు’ అని డీఎస్పీ వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com