ఈశాన్య రుతుపవనాల ప్రభావం కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించారు. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
తమిళనాడులోని పుదుచ్చేరిలో ఇవాళ వానలు పడతాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. మరోవైపు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఇప్పటికే కేరళలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.