తప్పుడు కేసులతో తమ అధినేత చంద్రబాబును 52 రోజులు జైల్లో ఉంచడం దుర్మార్గమని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. హైకోర్టుపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని... బెయిల్ ఇచ్చి హైకోర్టు పరిధి దాటిందని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఉన్న ఇతర నిందితులందరూ బెయిల్ పై బయట ఉన్నారే విషయం పొన్నవోలుకు తెలియదా? అని ఆనందబాబు ప్రశ్నించారు. హక్కులు అందరికీ సమానంగానే ఉంటాయని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 22 నెలల తర్వాత కేసులో చంద్రబాబు పేరును చేర్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీగా కాకుండా జగన్ కు ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఆనందబాబు విమర్శించారు. గతంలో ఏ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కూడా పొన్నవోలు మాదిరి మీడియా సమావేశాలు పెట్టలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టే హక్కు పొన్నవోలుకు లేదన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ ప్రభుత్వం... చంద్రబాబుపై మద్యం లైసెన్సుల కేసు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.