తిరుమలలో కైశికద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశికద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామికి వేకువజాము నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజాము 4.45 నుంచి 5.45 గంటల వరకు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా నిర్వహిస్తారు. గ్రంథాల్లో పేర్కొన్న విధంగా మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు.