తెలుగుదేశం పార్టీకీ పోలీస్ శాఖతో ఎలాంటి విరోధం లేదని.. జగన్ తొత్తులుగా మారి బరితెగించి ప్రవర్తించే వారితోనే తమ పోరాటమని తెలుగుదేశం అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి.. శాంతిభద్రతల పరిరక్షణలో దేశస్థాయిలో ప్రశంశలు పొందిన పోలీస్ శాఖ నేడు ఎందుకిలా దిగజారిపోయిందని ప్రశ్నించారు. పరిధిదాటి చట్టవిరుద్ధంగా జగన్ కోసం పనిచేసే పోలీసులు టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. తప్పుచేసిన ప్రతి పోలీస్ అధికారి.. కచ్చితంగా న్యాయస్థానాల ద్వారా శిక్షింపబడటం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ విచారణ కోర్టులో కొనసాగుతుంటే.. పోలీసులు ఆయన అరెస్టుకు అత్యుత్సాహం చూపడమేంటని పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. ప్రొక్లెయిన్లు తీసుకెళ్లి మరీ అక్కడి భద్రతా సిబ్బందిని... స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేయడం జగన్ మార్క్ పాలన కాదా? అని ప్రశ్నించారు. ధూళిపాళ్లను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నామని, ఎవరైనా తనకు గిట్టనివారిపై తప్పుడు కేసు పెడితే.. నిజానిజాలు నిర్ధారించకుండానే పోలోమని అరెస్ట్ చేయడానికి వెళ్తారా? అంటూ మండిపడ్డారు.