ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలం వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
అలాగే, నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఇద్దర్నీ చికిత్స కోసం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితులు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దర్ని విజయవాడ భవానీపురం వాసులుగా గుర్తించారు. .
లారీని ఢీకొట్టి స్విప్ట్ కారు బోల్తా పడి.. అందులోని ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన మరో ఇద్దరిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఘటనా స్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం కోసం పంపినట్టు తెలిపారు.