కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆసక్తికర ఘటన జరిగింది. స్వామివారి దర్శనార్థం వచ్చి శుక్రవారం బంగారు హారం పోగొట్టుకున్న భక్తురాలికి.. దాన్ని మళ్లీ అధికారులు అప్పగించారు. తిరుపతికి చెందిన లలిత ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చారు. రూ.3 లక్షల విలువ చేసే హారాన్ని పోగొట్టుకుంది. ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మకు హారం దొరకడంతో ఆమె వెంటనే ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి అందజేశారు. వెంటనే ఆలయ అధికారులు మైకు ద్వారా హారం విషయాన్ని ప్రకటించడంతో లలిత అక్కడకు వెళ్లారు. ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి ఆమెకు హారాన్ని అప్పగించారు. హారం దొరికినా నిజాయితీ తీసుకొచ్చి ఇచ్చిన అనసూయమ్మను ఆలయ సిబ్బంది అభినందించారు. భక్తురాలు హారాన్ని పోగొట్టుకున్న విషయాన్ని గమనించలేదు.. మైక్‌లో అనౌన్స్‌మెంట్ తర్వాత అలర్ట్ అయ్యారు. అప్పుడు ఆమె చూసుకుంటే హారం లేదు.. ఆ వెంటనే వెళ్లి హారానికి సంబంధించిన వివరాలు చెప్పి తెచ్చుకున్నారు. పోయిన హారం దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు అనసూయమ్మ, ఆలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.