చిత్తూరు జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. తిరుపతి డిపో ఆర్టీసీ బస్సు తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టుకు.. వెదురుకుప్పం మండల పరిధిలోని పచ్చికాపల్లం నుంచి కార్వేటినగరం వైపు వెళ్తోంది. మండల పరిధి ధర్మాచెరువు ఎస్సీ కాలనీకి చెందిన మోహన్ తన కారులో పచ్చికాపల్లం వస్తూ.. పచ్చికాపల్లం సచివాలయ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును చూసి పక్కకు వెళ్లే క్రమంలో ఇరు వాహనాల డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. వారి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో ఆర్టీసీ డ్రైవరు ఈశ్వరయ్య బస్సు దిగి కిందకు రావడంతో ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. రోడ్డు నుంచి పక్కకు దిగకుండా తనపై దాడి చేస్తూవా అంటూ కారు యజమాని బస్సును అడ్డగించి నానా దుర్భాషలాడటంతో ప్రయాణికులు, స్థానికుల ఇరువురికీ సర్దిచెప్పి పంపారు. తనపై ఆర్టీసీ డ్రైవరు దాడి చేశాడని మోహన్.. తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో కొందరు యువకులు టీఆర్‌పురం జగనన్న కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవరు ఈశ్వరయ్యను బలవంతంగా బస్సు నుంచి కిందకు లాగి మరీ దాడి చేశారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. అయితే ఆర్టీసీ డ్రైవరు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు.