బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 27 నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అనంతరం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి ఈ నెల 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అంతేకాదు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
అన్నమయ్య జిల్లా కలకడలో 62.2 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా నూజివీడులో 36.8, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 28.2, బాపట్లలో 24.2, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 22.8, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 21.4, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 20.4 , ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 18.4, బాపట్ల జిల్లా రేపల్లెలో 18.2, బాపట్ల జిల్లా కారంచేడులో 18.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల అల్పపీడన ప్రభావంతో చిన్న చిన్న వర్షపు జల్లులు కురవడంతో ఆందో ళన చెందిన రైతులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి మేఘావృతమై ఉండడంతో భయంలో ఉన్నారు. కోత చేసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందిపడ్డారు. అలాగే కోసిన వరిని కుప్పలు పెట్టే పనిలో ఉన్నారు. వేలాది ఎకరాల్లో వరిపైరు కోతలు కోశారు.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు పొలాల్లో ఉన్న చేలు కాపాడుకునే పనిలో ఉన్నారు.