ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నప్పటికీ.. ఆ పార్టీ పక్క చూపులు చూస్తోందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఒకవేళ టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం తాము మద్దతు ఇస్తామన్నారు.
బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే చంద్రబాబును జైలుకు పంపారని నారాయణ ఆరోపించారు. కేంద్రం కాళ్లపై జగన్ పడటంతోనే పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని నారాయణ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేళ్లుగా బెయిల్‌పై ఉండి ఓ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్ మాత్రమేనన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతోనే జగన్ ఇన్నేళ్లుగా బయట ఉంటున్నారని ఆరోపించారు. జగన్‌ను అదానీ కలిసిన తర్వాతే కేంద్రం విశాఖ నౌకాశ్రయం, బీచ్ ఇసుక కాంట్రాక్టును ఆయనకు అప్పగించిందన్నారు.
న్యాయవ్యవస్థతో పాటు సీబీఐ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలను సైతం బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మద్దతుకు ఒప్పుకోనందువల్లే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అకారణంగా అరెస్టు చేయించిందన్నారు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు సీపీఐ నీరాయాణ. ఆడవాళ్లు చీరలు వ్యాపారం చేసుకోవాలి కానీ.. లిక్కర్ వ్యాపారమేంటీ..? అని.. కూతురును కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో కలిశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓడితేనే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు. కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.