ఏపీలో చేపట్టిన ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’(వై ఏపీ నీడ్స్ జగన్) రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య ఈ పిల్ వేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీకి ఓటేసేలా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఈ కార్యక్రమం ద్వారా ప్రభావితం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో జీవో, సర్క్యులర్, మెమోకాని జారీ చేయలేదని తెలిపారు. కేవలం జగన్‌ను కీర్తించడానికే రూ.పది కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్య రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధమని పిల్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్సార్‌సీపీ జెండాలను ఎగురవేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనని ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. దీన్నిబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ తటస్థత కలిగి ఉండాలని పేర్కొన్నారు. రూల్ 5(1) ప్రకారం ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని పిల్‌లో పేర్కొన్నారు.