చైనాలో చిన్నారుల్లో న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. ప్రజారోగ్యం, హాస్పిటళ్ల సన్నద్ధతను వెంటనే పునః పరిశీలించి, బలోపేతం చేయాలని ఆదేశించింది. శ్వాసకోస వ్యాధులను అరికట్టడం కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్రం సమీక్షను ప్రారంభించింది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించారో అదే తరహాలో ఉండాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా ఇన్ఫెక్షన్లు, సారీ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జాగ్రత్తగా గమనించాలని కేంద్రం ఆదేశించింది.
ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, సార్స్ కోవ్-2 లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల శ్వాసకోస సమస్యలు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు శ్వాసకోస సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆరోగ్య శాఖ సైతం అప్రమత్తమైంది. ఫీవర్ క్లినిక్‌లను పెంచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. కోవిడ్-19 నిబంధనలను సడలించిన తర్వాత చైనాలో ఇదే తొలి చలి కాలం కావడంతో.. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. చైనాలో గుర్తించని న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతుండటంతో.. న్యుమోనియా కేసులకు సంబంధించి మరింత సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం చైనాను కోరిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కరోనాకు సంబంధించిన వివరాలను చైనా మిగతా ప్రపంచ దేశాలతో ముందుగానే పంచుకోని నేపథ్యంలో.. ఈసారి డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది.
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నవంబర్ 13న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. న్యుమోనియో కేసులు ఒక్కసారిగా పెరగడంతో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆ సమావేశంలో తెలిపారు. బీజింగ్, లియావోనింగ్ లాంటి చైనా ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. బీజింగ్‌లోని ఓ ప్రధాన హాస్పిటల్‌లో రోజుకు సగటున 1200 మందికిపైగా ఎమర్జెన్సీ రూమ్‌లో చేరుతున్నారని అల్ జజీరా పేర్కొంది. న్యుమోనియా బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా బీజింగ్‌లోని పలు స్కూళ్లలో విద్యార్థుల హాజరు తగ్గింది.