ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్‌లాండ్ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్ దిశగా పయనించే సమయంలో తుఫాన్ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బలహీన పడుతుందని చెప్పింది. ఈ తుఫాను దక్షిణ కోస్తా... తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళుతుందని అంచనా వేశారు.
దీని ప్రభావంతో నవంబరు 26 నుంచి 28 వరకూ అండమాన్ నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న అండమాన సముద్రంలో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యాకారులు నవంబరు 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు, తమిళనాడులో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై సహా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. శనివారం కురిసిన వర్షానికి చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వాననీరు నిలిచింది. శివారు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీగా కురిసింది. వేప్పేరి, పురసైవాక్కం, కోయంబెడు, గిండి, మైలాపూర్, సైదాపేట తదితర ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీరుతో జనం ఇబ్బందులు పడ్డారు. చైన్నై నగరంలో గత 24 గంటల్లో అధికంగా అడయారులో 72 మి.మీ. వర్షపాతం, పెరుంగుడిలో 44 మి.మీ., ఆలందూర్‌లో 37 మి.మీ. వర్షపాతం నమోదైంది.