పేదవాడినని జగన్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే, 20 ఏళ్ల కిందట జగన్ నిజంగానే పేదవాడని వెల్లడించారు. 2003లో వైఎస్ కుటుంబం పేద కుటుంబం అని తెలిపారు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ రిటర్నులు కేవలం రూ.9.19,951 మాత్రమేనని అచ్చెన్నాయుడు వివరించారు. 2004లో వైఎస్ ఇల్లు అమ్ముకునేందుకు కూడా సిద్ధమయ్యారని వెల్లడించారు. కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారిపోయిందని, తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని జగన్ భారీగా అవినీతి చేశారని, లక్ష కోట్లు సంపాదించారని అచ్చెన్న ఆరోపించారు. జగన్ అవినీతిపై సీబీఐ 11 కేసులను క్విడ్ ప్రో కో కింద నమోదు చేసిందని తెలిపారు. జగన్ కు చెందిన రూ.45 వేల కోట్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు సీజ్ చేశాయని వివరించారు. ఇప్పుడు జగన్ దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు.