అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు, విప్ ఏ జగదీష్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.. ఆయనకు భార్య ప్రమీల, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈయన 1981 నుంచి 1989 వరకు రెండుసార్లు మున్సిపల్ అధ్యక్షుడిగా పనిచేశారు. గుత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, విప్‌గా 1989 నుంచి 1994 వరకు కొనసాగారు. ఆయన సమ్మర్ స్టోరేజి ట్యాంకును నిర్వహించి పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాయలసీమలో ఎక్కడా లేని విధంగా గుంతకల్లులో 400కు పైగా వాణిజ్యపు గదులు నిర్మించారు. ప్రభుత్వ ఆస్పత్రికి సొంత గదులను నిర్మించడానికి కృషి చేశారు.