తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని.. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం హుండీ లో కానుకలు సమర్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రధాని.. సుమారు 50 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ప్రధాని తిరుమల నుంచి బయల్దేరి తెలంగాణకు రానున్నారు.. ఇవాళ ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా ఉంటారు. అంతకముందు ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి ప్రధాని తిరుమలలోని రచనా గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దర్శనం అనంతరం రచనా గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రేణిగుంట నుంచి తెలంగాణకు బయల్దేరారు.