కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి, విజయవాడలో కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.
ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది. సాయంత్రం గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.