ఏపీపై అల్పపీడనం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని భావిస్తు్నారు. ఇది ఈనెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో ఐదారు రోజుల పాటు వానలు కురుస్తాయి అంటున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. అలాగే రాబోవు రెండు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు.
ఈ వర్షాలతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఆరుగాలం కష్టించిన పంట చేతికందిన సమయానికి వానలు పడటంతో పొలాల్లో నీళ్లు చేరాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట వర్షార్పణం కావడంతో అదనపు ఖర్చులు తప్పడం లేదు. తేమశాతం, నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏలూరు జిల్లా అన్నదాతలు కోరుతున్నారు.