అప్పటికే పెళ్లైన ఓ వ్యక్తి.. ప్రేమ పేరుతో ఓ యువతికి దగ్గరయ్యాడు. ఇది నిజమేనని భావించిన యువతి.. అతడితోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. పెళ్లి గురించి మాట్లాడేందుకు ప్రియుడు ఇంటికి వెళ్లిన ఆమెను.. తన భార్యతో కలిసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సమీపంలోని అడవుల్లో పాతిపెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యోదంతాన్ని తలపించే ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో నాలుగు రోజుల కిందట చోటుచేసుకుంది.
రాయగఢ్ ఎస్‌డీపీవో ఆదిత్యసేన్ కథనం ప్రకారం.. బాఘబెడ గ్రామానికి చెందిన లుథురామ్ కుమార్తె తిలాబతి గోండ్ (23) గురువారం సాయంత్రం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల గాలించి మర్నాడు ఉదయం పోలీసులకుఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బారసుండి గ్రామానికి చెందిన చంద్ర రౌత్‌ను తిలాబతి ప్రేమించింది. అప్పటికే అతడికి మురుమదిహి గ్రామానికి చెందిన సియాబతితో వివాహమైంది. అయినాసరే. ప్రేమిస్తున్నానని చంద్ర రౌత్ వెంటపడటంతో నిజమేనని భావించి అతడి మైకంలో మునిగిపోయింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి అతడు ప్లేటు ఫిరాయించాడు. దీంతో గురువారం అతడి ఇంటికి వెళ్లిన యువతి.. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. ప్రియుడి భార్య సియాబతి అంగీకరించకపోవడంతో ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది.
చివరకు తిలాబతి పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని బెదిరించడంతో భార్యాభర్తలిద్దరూ ఆమెను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురుమడిహి అడవిలోకి తీసుకెళ్లి 31 ముక్కలుగా నరికి పాతిపెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన జుగుసాయి అనే వ్యక్తి భయభ్రాంతులకు గురయ్యాడు. వెంటనే అక్కడ నుంచి ఊళ్లోకి వెళ్లి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముక్కలుగా నరికి పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దారుణానికి ఒడిగట్టిన హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డీపీవో ఆదిత్యసేన్ స్పష్టం చేశారు. అయితే, రాయగఢ్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులకు ఉరే సరైందని డిమాండ్ చేశారు. అప్పుడే తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని, అవసరమైన సాక్ష్యాలు, రుజువులను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.