ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్ సొరంగం వద్ద 360 డిగ్రీల్లో మొదలైన ఆపరేషన్.. పలు దిక్కుల నుంచి డ్రిల్లింగ్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2023, 08:45 PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన సొరంగం శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడుగడునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రెండు వారాలుగా బాధితులు లోపలే ఉండిపోయారు. అన్ని సజావుగా సాగిపోతున్నాయి.. మరికొద్ది గంటల్లోనే వారంతా బయటపడతారని అనుకుంటున్న తరుణంలో ఊహించని ఆటంకంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు కార్మికులను చేరుకోవడానికి అనేక దిశల నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నాయి. ఆపరేషన్ ఆగిపోతున్నప్పుడు ఏకకాలంలో కార్మికుల శారీరక, మానసిక శ్రేయస్సును నిర్ధారించడంపై దృష్టి సారిస్తున్నారు.


ఆగర్ యంత్రం బ్లేడ్లు శిథిలాల్లో చిక్కుకుపోవడంతో సోమవారం నుంచి మ్యానువల్‌గా తవ్వకాలు మొదలుపెట్టారు. మొత్తం 60 మీటర్ల లోతుకు వెళ్లాల్సి ఉండగా.. 48 మీటర్ల వరకూ సాఫీగా సాగింది. అనూహ్యంగా బ్లేడ్లు విరిగిపోయి.. డ్రిల్లింగ్‌ మిషన్ శిథిలాల్లో చిక్కుకుపోయింది. దీంతో మనుషుల ద్వారా సొరంగానికి సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఇందుకు కోసం 11 మందితో కూడిన బృందాన్ని రప్పించారు. వీరిలో ఆరుగురు నిపుణులు కూడా ఉన్నారు. 800 మి.మీ. వెడల్పైన పైపు ద్వారా లోపలికి వెళ్లి శిథిలాలను తొలగిస్తారని రెస్క్యూ బృందం తెలిపింది. ఇద్దరు లేదా ముగ్గురు లోపలికి దిగి.. పైపుకు అడ్డుగా ఉన్న శిథిలాలను సామాగ్రి సాయంతో తొలగిస్తారు. వాటిని చక్రాల ఉండే వాహనం ద్వారా బయటకు తీసుకొస్తారు.


మాన్యువల్ డ్రిల్లింగ్ చాలా శ్రమతో కూడుకున్నది. ఎలుకలు బొరియలు చేసినట్టు మైనింగ్ తవ్వకాలల్లో నైపుణ్యం కలిగిన ఈ నిపుణులు అడ్డుగా ఉన్న లోహ శిథిలాలను కూడా కత్తిరించగలరు. సమాంతర డ్రిల్లింగ్ ఆపరేషన్‌కు పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నందున, రెస్క్యూ టీమ్‌లు నిలువు డ్రిల్లింగ్ ప్రణాళికను అమలులోకి తెచ్చాయి. ఈ ప్లాన్‌లో సొరంగం ముఖద్వారంలో 300 మీటర్ల పాయింట్ నుంచి క్షితిజ సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి, ఆపై నిలువుగా 86 మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ హర్పాల్ సింగ్ మాట్లాడుతూ.. 31 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయిందని చెప్పారు. నిలువు డ్రిల్లింగ్ పద్ధతిలో ఒక పెద్ద సవాలు ఏమిటంటే, క్రస్ట్ లేదా టన్నెల్ పైకప్పు ద్వారా డ్రిల్ చేయడం. రెస్క్యూ టీమ్‌లు క్రస్ట్‌కు చేరుకున్న తర్వాత కొద్ది దూరం వరకు అడ్డంగా డ్రిల్ చేసి, ఆపై దాని కింద చిక్కుకున్న కార్మికులకు గాయాలు కాకుండా దాని ద్వారా డ్రిల్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆదివారం నుంచే నిలువు డ్రిల్లింగ్‌ను సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ నిపుణులు చేపట్టారు.


రెస్క్యూ బృందాలు బార్కోట్ నుంచి సొరంగం మరొక చివరలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే ఇది చాలా కాలం పట్టే పద్ధతి. దాదాపు 480 మీటర్ల దూరం డ్రిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు పేలుళ్లు జరిగాయి. ఇప్పటి వరకు కేవలం 10 మీటర్లు మాత్రమే పూడ్చారు. సొరంగం ఎడమ వైపున మినీ టన్నెల్ నిర్మించాలనేది మరొక ప్రణాళిక. ఈ మినీ టన్నెల్ సిల్క్యారా టన్నెల్‌కు లంబంగా ఉంటుంది. విశ్వసనీయ మూలాల ప్రకారం.. ఈ టన్నెల్ 180 మీటర్ల పొడవు ఉంటుంది. నిర్మాణానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. దీనికి సంబంధించిన పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com