కేరళలోని పత్తనంతిట్టా జిల్లా పెరియార్ అభయారణ్యంలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మండల పూజలు నవంబరు 17న ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ఈ యాప్ ద్వారా శబరి యాత్రికులు పలు సేవలను పొందవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండటం గమనార్హం.
అయ్యప్ప ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, అడవి మార్గం, పబ్లిక్ టాయ్‌లెట్‌లు, హెల్త్ ఎమర్జెన్సీ, వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్‌లు, ప్రతి స్థావరం నుంచి సన్నిధానం వరకు ఉన్న దూరం, తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అడవి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు దాడి చేసినట్లయితే.. ఈ యాప్‌ను ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ అధికారులు తెలిపారు.
పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం వెస్ట్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ యాప్.. పంపా, సన్నిధానం, స్వామి అయ్యప్పన్ రోడ్, పంపా-నీలిమల-సన్నిధానం, ఎరుమేలి-అఝుతకదవ్-పంపా, సత్రం-ఉప్పుపర వద్ద అందుబాటులో ఉన్న సేవలతో సహా తీర్థయాత్రకు సంబంధించిన అన్ని అంశాలపై సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు అనుసరించాల్సిన మర్యాదలు, సాధారణ మార్గదర్శకాలను యాప్‌లో పొందుపరిచారు. గతేడాది మండల-మకరువిళక్కు సీజన్ సందర్భంగా ఎరుమేలి, వండిపెరియార్ సత్రం నుంచి ఆలయానికి వెళ్లే రెండు అటవీ మార్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ కనిపించింది.