కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకొని 17 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. విదేశీ టెక్నాలజీ సైతం ఫెయిలైన వేళ.. దేశీయ నిపుణుల శ్రమ ఫలితాలను ఇచ్చింది. ‘ర్యాట్ హోల్ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) అద్భుతం చేశారు. సోమవారం రాత్రి నుంచి మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టినే 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. 57 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తి చేసి.. కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత గొట్టాన్ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. టన్నెల్ వెలువల అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లలో కూలీలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
17 రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ వారిని చూసి కుటుంబసభ్యుల కళ్లు ఆనందభాష్పాలతో చెమ్మగిల్లాయి. మొత్తం 41 మంది కార్మికులను సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలోని సిల్క్‌యారా సొరంగంలో నవంబరు 12న కార్మికులు పనులు చేస్తుండగా.. టన్నెల్ కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 41 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. 2 కి.మీ. పొడవైన సొరంగం ముందుభాగంలో 200 మీటర్ల మేర మూసుకుపోవడంతో బయటికి వచ్చే మార్గం లేకుండాపోయింది.టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది 17 రోజులుగా అలుపెరుగని పోరాటం చేశారు. తొలుత సొరంగంలోకి రంధ్రం చేసి బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు లాంటివన్నింటినీ అందించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు అందజేశారు.