ఎప్పుడో బ్రిటీష్ కాలంలో భూముల సర్వే జరిగిందని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు తమ భూములపై సరైన హక్కు పత్రాలను అందచేస్తూ చట్టబద్దం చేస్తోందని రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇటువంటి పనులను గత ప్రభుత్వాలు చేయగలిగాయా అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. జమీందార్ల, భూస్వాములు, రాజులు వద్ద లక్షల ఎకరాల భూమి ఉంటే సీఎం జగన్ వాటిని పేదలకు పంపిణీ చేసారన్నారు. భూ పంపిణీతో పేదలకు సామాజికి హోదాను జగన్ కల్పించారన్నారు.రాష్ట్రంలో అన్ని హంగులున్న, ఏకైక అతి పెద్ద నగరమైన విశాఖను రాజధాని చేయాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు చేస్తే, రాత్రికి రాత్రి అమరావతిని రాజధాని చేసి చంద్రబాబు కేంద్ర నిర్ణయాన్ని తొక్కి పెట్టారన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల అదృష్టశావత్తు జగన్ సీఎం అయి విశాఖను రాజధాని చేస్తానంటే ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 32 లక్షల మందికి 12 వేల 800 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి కాలనీలు మాత్రమే కాకుండా ఊర్లకు ఊర్లే నిర్మాణాన్ని జగన్ చేపడుతున్నారన్నారు. రూ. 2,40,000 కోట్ల ఖర్చు చేసి నాలుగున్నరేళ్లగా నిరంతరాయంగా సంక్షేమాన్ని జగన్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చెప్పిన అనేక పనులు చేసామని, ఇంకా ఏమైనా మిగిిలి ఉంటే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు ఒకసారి పథకాల పేరుతో జగన్ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారని అంటాడని, రాజమండ్రి లో మరోసారి జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని ప్రకటించాడని, ఈరెండింటిలో దేనికి కట్టుబడి ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేసారు.