వెనుకబడిన జాతులకు గౌరవం ఇచ్చిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పరిపాలన చేస్తున్నారంటే అది జగన్ కే సాధ్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఉద్ఘాటించారు. గ్రామ స్థాయిలో సుపరిపాలన కోసం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారని వివరించారు. చంద్రబాబు మాట్లాడితే 45 సంవత్సరాల అనుభవమని చెప్పుకుంటాడు గానీ, రాష్ట్రానికిి ఏం చేసాడనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. వెనుకబడిన జిల్లా అయిన విజయనగరంలో ఎన్నడూ అగ్రకులాలు పరిపాలన చేయడం వల్ల అభివృద్ధి లేకుండా పోయిందని, బీసీల పాలనలోకి వచ్చిన తర్వాతే అనేక రంగాల్లో జిల్లా పురోగతి సాధించిందని పేర్కొన్నారు. టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పని చేసినా సరే బోగాపురం ఎయిర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేయకపోగా, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వారిపై కేసులు పెట్టి వేధించారన్నారు. రూ. 4,700 కోట్ల వ్యయంతో భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు వైయస్ జగన్ హయాంలో జోరుగా సాగుతున్నాయని వివరించారు.