సీఎం జగన రెడ్డి పైకి మాత్రం ‘నా బీసీ, నా ఎస్సీ’ అంటూ కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. జగన పాలనలో బీసీల పరిస్థితి, టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి రాష్ట్ర పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లలో బీసీలకు జరిగిన అన్యాయం తెలిస్తే ఏ ఒక్క బీసీ కూడా వైసీపీకి ఓటు వేయరన్నారు. బీసీలకు మొదటి నుంచి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. కానీ జగన మాత్రం బీసీల జపం చేస్తూ వారికి ఎలాంటి అధికారాలు, హక్కులు లేకుండా చేశారన్నారు. ఈనాలుగున్నరేళ్లలో 74మంది బీసీలను హత్య చేశారంటే బీసీల పై వారి ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. 5వేల మంది బీసీలపై దాడులు జరిగాయన్నారు. చాలా మందిపై అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపారన్నారు. రూ.75,760 కోట్ల బీసీ సబ్‌ప్లాన నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. ఆదరణ లాంటి 30కిపైగా పథకాలు రద్దు చేసిన ఘనత జగన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్లు 34శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారని విమర్శించారు. 14లక్షల ఎకరాల అసైన్డ భూముల కబ్జా జరిగితే అందులో అత్యధిక భాగం బీసీలవేనన్నారు. 70వేలకు పైగా బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని యూనివర్శిటీలన్నింటిలోనూ తమ సామాజిక వర్గం, తమకు అనుకూలమైన వారికే పదవులు ఇచ్చారన్నారు. 13బీసీ భవనాలు, 1187కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను నిలిపివేసిన చరిత్ర నేటి వైకాపా ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం రావాల్సి ఉండగా, ఆయన్ని తప్పించి 16వస్థానంలో ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించారని విమర్శించారు. ఇలా చెబుతూ పోతే బీసీలకు ఈపాలనలో జరిగినంత అన్యాయం మరెవరి పాలనలోనూ జరగలేదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈకార్యక్రమంలో మండలంలోని పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.