సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయం వరకే రాజకీయాలను పరిమితం చేసి మిగిలిన సమయంలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని, గిరిజనం ప్రాంతంలో మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక విద్యను గిరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే నడవాలని, లేకుండా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నాయకుడుగా వైయస్ జగన్ ఉన్నప్పటి నుంచి కురుపాం ప్రాంత అబివృద్ధి పనుల కోసం ఆలోచించేవారని, అప్పుడు అధికారంలో ఉన్న నేతలు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగినా, సంక్షేమం అమలు చేసినా సరే అది జగన్ ద్వారా మాత్రమే సాధ్యమైందన్నారు. గత ఎన్నికల్లో ప్రజల అండదండలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో వైయస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసిందని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రీతిలో ఆదరించాలని కోరారు. టీడీపీ నేతలు సుదీర్ఘకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినా సరే అభివృద్ధిని పట్టించుకోలేదని, జగన్ నాయకత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమం జరగనుందని వెల్లడించారు.