రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి (శనివారం) తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి (ఆదివారం) తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. సోమవారం (డిసెంబర్ 4) సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నారు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచనలు చేశారు.